లాస్ట్ డేట్ టు ఫైల్ ఐటీఆర్




మీరు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులైతే.. ఈ తేదీని మరిచిపోవద్దు. ఆ తేదీ నేటి నుంచి కేవలం 20 రోజులే దూరంలో ఉంది. అదేం తేదీ అంటారా? ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే అదే లాస్ట్ డేట్. అంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31వ తేదీ చివరి తేదీ.

కరోనావైరస్ కారణంగా గత రెండు సంవత్సరాలు వరుసగా ఐటీఆర్ దాఖలు చేసే చివరి తేదీని వాయిదా వేశారు. కానీ ఈసారి అలాంటి వెసులుబాటు కనిపించలేదు. కొంతమందికి ఇంకా సమయం ఉంది అని అనిపించవచ్చు కానీ మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా గందరగోళంతో ఫైలింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగితే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేయకపోతే దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అత్యవసర ప్రాతిపదికన డబ్బు అవసరమైనప్పుడు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకు వారు ఐటీ రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేశారో లేదో చెక్ చేస్తారు. సకాలంలో దాఖలు చేయకపోతే సకాలంలో దాఖలు చేసిన వారి కంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి లేదా లోన్ కూడా మంజూరు చేయకపోవచ్చు.

మరికొన్ని సందర్భాల్లో మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేయలేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు విదేశీ యూనివర్శిటీల్లో చదువుకోవాలని భావించే వారు లేదా శాశ్వత నివాసం కొరకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేసి ఉండాలి.

మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను సమయానికి సమర్పించకపోతే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234A మరియు 234F ప్రకారం... ఐటీ చట్టం, 1961లోని సెక్షన్లు 271F మరియు 271H ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉంది. మీ ఆలస్యానికి కారణాలు ఏమైనప్పటికీ, ఆలస్య రిటర్న్‌ల ఫైలింగ్‌పై వర్తించే జరిమానా నుండి తప్పించుకోలేరు.

సెక్షన్ 234A ప్రకారం... మీరు రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ రూ.5,000 వరకు జరిమానా విధించవచ్చు. అయితే, ఆలస్యం రిటర్న్ దాఖలు చేసే సమయంలో మీ మొత్తం పన్ను బాధ్యత రూ.5,000 కంటే తక్కువగా ఉంటే... ఆ సందర్భంలోనే మీరు రూ.5,000 చలాన్‌ను మాత్రమే చెల్లించాలి.

సెక్షన్ 234F ప్రకారం... మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను డిసెంబర్ 31వ తేదీ తర్వాత, కానీ మార్చి 31వ తేదీలోపు దాఖలు చేస్తే, రూ.5,000 జరిమానా విధించబడుతుంది. అంతేకాదు... మీ అదనపు పన్ను బాధ్యత ఉంటే, అదనపు పన్నుపై మీరు వడ్డీ చెల్లించాలి.

సెక్షన్ 271F ప్రకారం... మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను మార్చి 31వ తేదీ తర్వాత దాఖలు చేస్తే... జరిమానా మొత్తం మరింత పెరుగుతుంది. మీకు రూ.50,000 జరిమానా విధించబడుతుంది. దీనిలో తప్పించుకోవడమనేది ఉండదు.

సెక్షన్ 271H ప్రకారం... మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయకపోతే మరియు మీరు దాని కోసం అడిగినప్పుడు కూడా దాఖలు చేయనప్పుడు... ఆదాయపు పన్ను శాఖ రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

అందుకే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేయండి మరియు ఆలస్యం చేయవద్దు. కేవలం మీ ఆలస్యం కారణంగా మీకు అనవసర పన్నులు మరియు జరిమానాలు విధించబడతాయి. అంతేకాకుండా, సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే మిమ్మల్ని మీరు శాంతియుతంగా ఉంచుకోవచ్చు.